Friday, July 8, 2011

Naga Bandham

అనంత పద్మనాభుడి ఆలయంలో ఆరవ నేల మాళిగ తెరవద్దు ఈ నెల 14న తదుపరి విచారణ : సుప్రీంకోర్టు కేరళ, జూలై 8 : కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయంలోని ఆరవ నేలమాళిగను తెరవద్దని శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టు ఆదేశిస్తూ, ఈ నెల 14న తదుపరి విచారణ జరగనున్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు పద్మనాభస్వామి ఆలయంలో తెరిచిన ఐదు గదుల నుంచి ఐదు లక్షల కోట్ల రూపాయల అపార సంపద బయటపడిన విషయం తెలిసిందే. కాగా ఆరవ మాళిగకు నాగ బంధం ఉండటంతో తెరిస్తే అరిష్టం అని స్థానికులు, భక్తులు నమ్ముతున్నారు. దీంతో సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. అనంత పద్మనాభుడి ఆలయంలో ఉన్న ఆరో నేలమాళిగను ఇప్పటివరకు తెరవలేదు. దాన్ని తెరిస్తే కచ్చితమైన లెక్క తేలుతుందని అంటున్నారు. పురాతన కాలానికి చెందిన ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలు, మరకత మాణిక్యాలు, కిరీటాలు, ఇవన్నీ ఉండటంతో వాటి విలువ అపారంగా ఉంటుందని చెబుతున్నారు. అయితే.. ఆరో నేలమాళిగకు 'నాగబంధం' ఉంది. అందువల్ల దీన్ని తెరిస్తే అరిష్టం తప్పదని భక్తులు నమ్ముతున్నారు. సంపద లెక్కతేలుస్తున్న కమిటీ సభ్యులలో ఒకరికి కాలు విరిగిపోగా, మరొకరి తల్లి దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తాజాగా మరణించారు. ఈ విషయాలన్నింటినీ అందుకు నిదర్శనంగానే భక్తులు చెబుతున్నారు. నాగబంధాన్ని తెరవడం అంత సులభమూ కాదు.. మంచిదీ కాదని వారు అంటున్నారు. అనంత పద్మనాభస్వామి వేయి పడగల శేషనాగు మీద శయనిస్తారు కాబట్టి.. ఆ ముద్రలో ఉన్న స్వామి ఆలయంలో మాళిగలను.. అందునా నాగబంధం ఉన్న మాళిగలను తెరవడం ఏమాత్రం సరికాదని వారు చెబుతున్నారు. దాదాపు శతాబ్దం క్రితం ఒకసారి కేరళలో విపరీతమైన కరువు వచ్చినప్పుడు కూడా ఈ మాళిగలను తెరుద్దామన్న ప్రయత్నం చేసినా, నీళ్లు ప్రవహిస్తున్న శబ్దాలు రావడంతో మానుకున్నారన్న కథనాలు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి.

No comments:

Post a Comment