Saturday, March 21, 2015

శోధన నేత full ముశం దామోదరరావు!

శోధన నేత
Updated : 4/16/2014 2:41:13 AM
Views : 637
కొన్ని పనులు వ్యక్తులకు పేరుతెస్తాయి... ఇంకొన్ని పనులు వ్యక్తుల వల్ల పేరుతెచ్చుకుంటాయి!
ఆ రెండో కోవలోని వ్యక్తే ముశం దామోదరరావు!
ఆయనో పరిశోధనా గ్రంథం!
చదివింది పదే.. నేర్చుకుంది పదిహేను భాషలు..
సేకరించింది పదిహేనువేల పుస్తకాలు..
దేశవిదేశాలకు సంబంధించిన వేల నాణాలు..
శోధిస్తున్నది... శాతవాహన, ఇక్షాకుల మూలాలు...
పరిచయంచేసింది... పాలిస్టర్‌లూమ్.. భువనగిరికి!
ఇవన్నీ లైఫ్ యూనివర్శిటీ ఆయనకు ఇచ్చిన క్వాలిఫికేషన్స్! అరుదైన ఆ పట్టభద్రుడితో ఓ చిన్న ములాఖాత్...


హైదరాబాద్‌లోని ప్యారడైజ్‌లో వెస్లీ స్కూల్‌లో పదవ తరగతి చదవుకుంటున్నప్పుడు.. పుస్తకాలంటే ఇష్టమేర్పడింది. ఒకసారి మా ఇంగ్లీష్ టీచర్ 1.25 పైసలిస్తే అమతవాక్కులు అనే పుస్తకం తెచ్చుకొని చదివాను. అందులో ఉన్న కొన్ని మాటలు నన్ను అమితంగా ఆకర్షించాయి. ఇక అక్కడి నుంచి నా చేతికి డబ్బులు వస్తే చాలు.. అంజలీ టాకీస్ దగ్గరకు వెళ్లి పాత పుస్తకాలు తెచ్చుకొని చదివేవాడిని. అలా ఎక్కువ పుస్తకాలు చదవడంతో ఎక్కువ భాషలు నేర్చుకోవాలనే కోరిక కలిగింది. రష్యా,చైనా, జపాన్, ఫ్రెంచ్, బ్రహ్మీ, సింహాళీ, పాళీ వంటి పదిహేను భాషలు నేర్చుకున్నా.
6వ బట్టల దుకాణం..

మాతాత గారిది నల్లగొండలోని నెరడ గ్రామం. పేరు మూశం సీతారామయ్య. అప్పట్లో రజాకార్ల సమయంలో రాత్రివేళ తుపాకీ పట్టుకొని గస్తీ తిరిగేవాళ్లు. ఇట్లయితే.. రక్షణ ఉండదని ఏడు జాడీల నిండా వెండి నాణాలు నింపుకొని హైదరాబాద్ వచ్చి ఇక్కడే స్థిరపడ్డాడు. మా నాన్నా లక్ష్మీనారాయణ, అమ్మ అండాళమ్మ. మేం నలుగురం అన్నదమ్ములం. నేను రెండోవాడిని. మేం పద్మశాలీలం. అందుకే ఇంట్లో అందరూ మగ్గాలు నేస్తారు. నల్లగొండలో నేసే ధోతులను విజయవాడ, తమిళనాడు నుంచి వచ్చి మరీ కొనుగోలు చేసేవారట ఒకప్పుడు. అందుకేనేమో నల్లగొండ చుట్టు పక్కన భూదాన్ పోచంపల్లి, మునుగోడు, సూర్యపేట ప్రాంతాలలో చేనేత కార్మికులు ఎక్కువగా స్థిరపడ్డారు. 
mulakath
20 యారన్(దారం)తో ధోతులు నేయడంతో నెరడ దోతులకు అప్పట్లో మంచి పేరుండేది. అందుకే అవే ధోతులను నేను నేయాలని నిర్ణయించుకున్నా. దానికోసం బొంబాయి, సూరత్, పుణే వంటి నుంచి మాల్ తెచ్చి అమ్మేవాడిని. జేమ్స్ స్ట్రీట్లో రాళ్లతో కట్టిన బిల్డింగ్ ఒకటి ఉండేది. దాంట్లో మా దుకాణం నంబర్ 6. అందుకే అక్కడ నన్నంతా 6వ బట్టల దుకాణం అని పిలిచేటోళ్లు.
హ్యాండ్లూమ్ తయారీకి..

ఒకసారి బొంబాయి పోయిన. అక్కడ గోడౌన్‌లో పనికి రాని నూలు పడి ఉండడం చూసినంక నాకో ఆలోచన వచ్చింది. వెంటనే అమలు చేసిన. పాలిస్టర్‌స్క్రాప్ తక్కువధరకు కొని భువనగిరి నేత కార్మికులకు సరఫరా చేసిన. అట్లా భువనగిరికి పాలిస్టర్‌లూమ్‌ను పరిచయం చేసిన. మా తాతా, నాన్నకు కొండా లక్ష్మణ్‌బాపూజీతో మంచి సంబంధాలు ఉండేవి. వారివల్ల ఆయనతో నాకూ పరిచయం ఏర్పడింది. ఆయన సలహాతోనే గడ్డ మీది ఆగయ్యతో కలిసి నామాల గుండులో ప్రింటింగ్ ప్రాసెసర్‌ను స్టార్ట్ చేసిన. అట్లనే ప్యాంట్ బట్టలో పాలిస్టర్‌ను అతి కష్టమ్మీద కలిపి నేసినం. అందుకే భువనగిరిలో పాలిస్టర్ బట్టలకు సంబంధించిన వత్తి పనివారు అక్కడే స్థిరపడే అవకాశం దొరికింది.
ప్రజెంటేషన్‌ల పరంపర..

నాకు హ్యాండ్లూమ్‌ల మీదే కాదు.. పురాణాల మీద కూడా పట్టు ఉంది. మార్కండేయ పురాణాలలో సెకన్లు, యోజనాలు, మైల్స్ ఇలా అన్నింటి గురించి ఉంది. ఈ విషయాన్ని 1987మేలో కలకత్తాలోని అసోసియేట్ సోసైటీలో జరిగిన సెమినార్‌లో ప్రజెంటేషన్ చేసిన. ఇది జరిగిన 22సంవత్సరాల తరువాత ఒక అమెరికన్ జర్నల్ ప్రచురించుకొన్నాడు. దాన్ని మన దేశం ఖండించకపోవడంతో చాలా బాధనిపించింది. రుగ్వేదంలో విమానాల గురించి ఉంది. శాస్త్రీయంగా విమానరెక్కలు చక్కగా ఉంటే వేగం పెరగగానే రెక్కలు విరిగిపోతాయని విమానరంగంలో ఉన్న వారికి తెలుసు.. ఈ విషయంపై 1986లో పుణేలో ఫర్గ్యూసన్ మిలటరీ కాన్ఫరెన్స్‌లో వివరాలతో సహా ప్రజెంటేషన్ ఇచ్చాను. అప్పటి వైమానిక అధికారి టి. రామకష్ణన్ కూడా ఈ విషయాన్ని అంగీకరించారు.
టీవీ అండ్ రేడియో డీఎక్స్..

మనదేశంలో దూరదర్శన్ ప్రసారాలు 60కిమీటర్ల వరకే పరిమితం. అందువల్ల వేరే చానళ్లను చూసే అవకాశం లేదు. అందుకే కత్రిమ పద్ధతిలో డీఎక్స్ విధానాన్ని కనిపెట్టిన. దాని ద్వారా ఐదు దేశాల చానల్స్‌ని చూడొచ్చు. ఈ డీఎక్స్ విధానాన్ని 1980లో దూరదర్శన్ చానల్లో వివరంగా చెప్పిన. దానికి చాలా ప్రశంసలొచ్చాయి.
నాణాల సేకరణ..

నాణాలు సేకరించే అలవాటూ ఉంది. ఒకసారి విశాలాంధ్ర బుక్‌హౌస్‌లో నాణాలు చెప్పిన కథ అనే పుస్తకం ఒకటి కనిపించింది. అది చదివిన దగ్గర నుంచి నాణాలు సేకరించడం అలవాటైంది. అలా 150 దేశాలకు చెందిన 3వేల నాణాలు సేకరించిన. అవికాక మన దేశంలోని సంస్థానాధీశులకు సంబంధించిన 300నాణాలనూ సేకరించిన. వీటిలో అత్యంత పురాతన నాణం కరీంనగర్‌లో నాగరాజు కాలం నాటిది.
స్టాంప్ కలెక్షన్..

నాణాల మీద ఉన్న శ్రద్ధ క్రమంగా స్టాంపులమీదకు మళ్లింది. మన దేశ నాయకుల బొమ్మలు విదేశీ స్టాంపుల మీద ఉండటం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఉదాహరణకు బల్గేరియా దేశ స్టాంపుపై నెహ్రూ, గాంధీల బొమ్మలు ఉన్నాయి. ఈ విధంగా 250 దేశాల స్టాంపులు, ఉర్దూలో నిజాం విడుదల చేసిన స్టాంపులు, 8 పైసల స్టాంపులు కూడా సేకరించా. ప్రపంచంలో మొట్టమొదటిసారి విడుదలైన స్టాంప్ వన్ పెన్ని నుంచి మొదలుకొని ప్రిన్స్ చార్లెస్ డయానా పెళ్లి సందర్భంగా మారిషస్ విడుదల చేసిన స్టాంప్ వరకు ఎన్నో ఉన్నాయి నా దగ్గర! 200 దేశాల కరెన్సీలతో పాటు.. క్లాక్ సిల్క్ మల్బరీ బార్క్‌నోట్స్, ఉడెన్‌నోట్స్ కూడా ఉన్నాయి. మెటల్ షార్టేజీ ఉన్నప్పుడు మెంగినీ అనే రాజ్యం అట్టపై విడుదల చేసిన నాణెం కూడా ఉంది. ప్రస్తుత ప్రధాని మన్మోహన్‌సింగ్ సెక్రటరీ ఆఫ్ ఫైనాన్స్‌గా ఉన్నప్పుడు రూపాయి నోటుపై సంతకం చేసిన కరెన్సీకూడా నా దగ్గర భద్రంగా ఉంది.

శ్రీరాములు రాంనర్సయ్య కుమార్తె రేఖతో 1985లో నా పెళ్లి అయింది. నాకు ఒక కూతురు, కొడుకు. నేను చేసిన ప్రతీ పని నాకు సంతప్తినిచ్చిందే! భరద్వాజ విమాన శాస్ర్తాన్ని తెలుగులోకి అనువదించిన. నాలుగు వందల పై చిలుకు పేజీల పుస్తకమది. దాన్ని పబ్లిష్ చేయాలనుకుంటున్నా. పబ్లిషర్లు దొరకక ప్రస్తుతమైతే ఆగిపోయిన కానీ ఎప్పటికైనా ఆ పుస్తకాన్ని వెలుగులోకి తీసుకొస్తా.

No comments:

Post a Comment