Saturday, March 24, 2012

పది జిల్లాల్లో తెలుగు అకాడమి ప్రాంతీయ కేంద్రాలు

 పది జిల్లాల్లో తెలుగు అకాడమి ప్రాంతీయ కేంద్రాలు  రాష్ట్రంలోని పది జిల్లాల్లో తెలుగు అకాడమి ప్రాంతీయ కేంద్రాలు ప్రారంభించనున్నట్టు తెలుగు అకాడమి సంచాలకుడు ఆచార్య కె. యాదగిరి మీడియా ప్రతినిధులతో శుక్రవారం చెప్పారు. పది జిల్లాల్లో ప్రాంతీయ కేంద్రాల్లో కేవలం పుస్తకాల అమ్మక కౌంటర్లకే పరిమితం కాకుండా మంచి లైబ్రరీని, కార్యక్రమాల నిర్వహణ హాలును కూడా నిర్మిస్తామని చెప్పారు. దీనివల్ల తెలుగు అకాడమి ప్రజలకు చేరువ అవుతుందని చెప్పారు. తెలుగు విశిష్ట్భాషా కేంద్రానికి ఇటు తెలుగు విశ్వవిద్యాలయం తరఫున, తెలుగు అకాడమి తరఫున విశేషకృషి చేస్తున్నామని, ప్రపంచంలో ఎక్కడ ఉన్న తెలుగు ఆనవాళ్లనైనా ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. తెలుగు విశిష్ట్భాషా కేంద్రం ఏర్పాటు చివరి దశకు వచ్చిందని, తెలుగు వారంతా గర్వించదగ్గ రీతిలో ఈ కేంద్ర ప్రారంభం జరుగుతుందని చెప్పారు. తెలుగుభాషకు గతిశీలక డిజిటల్ డిక్షనరీని రూపొందించడం పూర్తయిందని, దీనిని చాలా చౌకధరలో మార్కెట్‌లోకి తీసుకువచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని, విద్యార్థులకు తక్కువ ధరకే ఈ డిక్షనరీ లభ్యం అవుతుందని పేర్కొన్నారు. ఈ నిఘంటువును ఐదు భాషలకు అనువర్తనం చేస్తున్నామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తెలుగు అకాడమి తరఫున మూడు పరిశోధన పత్రికలు నిర్వహించనున్నట్టు చెప్పారు. అందులో ఒకటి భాషా సాహిత్యానికి, మరొకటి సామాజిక అంశాలపైనా, ఇంకోటి వైజ్ఞానిక అంశాలపైనా నిర్వహిస్తామని పేర్కొన్నారు. డిగ్రీ స్థాయి వరకూ తెలుగు భాషను లాంగ్వేజి పేపర్‌గా కాకుండా ఒక జనరల్ పేపర్‌గా కూడా ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉందని, ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.

No comments:

Post a Comment